London: లండన్‌లో చెత్త ట్రక్కు ఢీకొనడంతో భారతీయ విద్యార్థిని దుర్మరణం

  • మార్చి 19న భర్తతో కలిసి చైస్తా కొచ్చర్ సైక్లింగ్ చేస్తుండగా ప్రమాదం
  • మహిళను చెత్త ట్రక్కు ఢీకొనడంతో ఘటనా స్థలంలోనే దుర్మరణం
  • గతంలో నీతి ఆయోగ్ లో సలహాదారుగా పనిచేసిన చైస్తా
  • పీహెచ్‌డీ చేసేందుకు గతేడాది లండన్‌కు వెళ్లిన వైనం
  • మహిళ మృతిపై నీతి అయోగ్ మాజీ సీఈఓ సంతాపం
Indian Student Dies In Accident While Cycling Back Home In London

బ్రిటన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతీయ మహిళ (33) చైస్తా కొచ్చర్ దుర్మరణం చెందారు. గతంలో నీతి ఆయోగ్ లో పనిచేసిన ఆమె లండన్‌ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో పీహెచ్‌డీ చేస్తున్నారు. మార్చి 19న భర్తతో కలిసి సైక్లింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. భర్త ముందు వెళుతుండగా మరో సైకిల్‌పై వెళుతున్న చైస్తాను చెత్త తరలించే ట్రక్కు ఢీకొట్టింది. ఈ క్రమంలో ఆమె ఘటనాస్థలంలోనే మరణించారు. 

కాగా, చైస్తా మృతిపై నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ విచారం వ్యక్తం చేశారు. నీతి ఆయోగ్ లోని లైఫ్ ప్రోగ్రామ్‌లో ఆమె పనిచేసినట్టు తెలిపారు. ఇంత త్వరగా ఆమె లోకాన్ని విడిచి వెళ్లడం విషాదకరమని వ్యాఖ్యానించారు. ఆమె ఎంతో ధైర్యవంతురాలు అంటూ కితాబునిచ్చారు. ప్రస్తుతం లండన్‌లో ఉన్న ఆమె తండ్రి లెఫ్టెనెంట్ జనరల్ ఎస్పీ కొచ్చర్ కుమార్తె మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. 

గురుగ్రామ్‌కు చెందిన చైస్తా కొచ్చర్ గత సెప్టెంబర్‌లోనే పీహెచ్‌డీ కోసం లండన్ వెళ్లారు. ఆర్గనైజేషనల్ బిహేవియరల్ మేనేజ్‌మెంట్‌లో ఆమె పీహెచ్‌డీ చేస్తున్నారు. నీతి ఆయోగ్ లోని నేషనల్ బిహేవియరల్ ఇన్‌సైట్స్ యూనిట్ ఆఫ్ ఇండియా విభాగంలో ఆమె సీనియర్ సలహాదారుగా పనిచేశారు.

More Telugu News